Amazing-Anti-Ageing-Face-Packs-for-Youthful-Skin
Amazing-Anti-Ageing-Face-Packs-for-Youthful-Skin

యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్స్ (Homemade Anti Aging Face Packs) 

 

వయసు పెరిగే  కొద్దీ చర్మం మెరుపు కోల్పోవడం సహజం. పైగా చర్మం తన బిగిని కోల్పోయి వదులుగా తయారవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ప్రస్తుతం మార్కెట్లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు విరివిగానే లభిస్తున్నాయి. అయితే వీటిని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలెలా ఉన్నా.. దుష్ప్రభావాలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి బదులుగా ఇంట్లోనే తయారు చేసుకొనే యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్స్ అప్లై చేసుకోవడం మంచిది.

1. ఎగ్ వైట్ (Egg)

 

గుడ్డులోని తెల్లసొనలో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణ ఇచ్చి ముడతలు పడకుండా చూస్తాయి. అలాగే చర్మానికి అవసరమైన ఇతర పోషకాలు సైతం తెల్ల గుడ్డు సొనలో లభిస్తాయి.

గుడ్డు అందించే ఈ ఫలితాన్ని పొందడానికి.. ఎగ్ వైట్‌లో కొద్దిగా మిల్క్ క్రీం, కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

 

2. అరటిపండు, రోజ్ వాటర్, తేనె, పెరుగు (Banana, Rose Water, Honey And Yogurt)

అరటి పండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి పోషణను అందించి ముడతలు పడకుండా చేస్తాయి. రోజ్ వాటర్ ముఖం పై ఉన్న మచ్చలను చర్మం రంగులో కలసిపోయేలా చేస్తుంది.

బాగా ముగ్గిన అరటిపండు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనిలో టీస్పూన్ చొప్పున రోజ్ వాటర్, తేనె, పెరుగు వేసి బ్లెండర్ సాయంతో మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది.

 

3. బంగాళా దుంప (Potato)

 

బంగాళాదుంపలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం యవ్వనంగా ఉండటానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెరిగేలా చేస్తుంది. దీనివల్ల చర్మం సాగిపోదు. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

బంగాళాదుంపను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా తయారుచేయాలి. దీన్ని పలుచని వస్త్రంలో వేసి బాగా పిండి రసాన్ని వేరు చేయాలి. ఈ పొటాటో జ్యూస్‌లో దూదిని ముంచి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పావు గంట తర్వాత చల్లని నీటితో దీనిని కడిగేసుకొంటే సరిపోతుంది. బంగాళాదుంప రసాన్ని తీసేటప్పుడు నీరు కలపకూడదు.

 

4. చెరకు రసం (Sugarcane Juice)

 

చెరకు రసంతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతుంటాం. దీన్ని ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మాత్రమే కాదు.. చర్మ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దీనిలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

మూడు టేబుల్ స్పూన్ల చెరకు రసంలో.. చెంచా పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొంటే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.

 

5. కొబ్బరి పాలు (Coconut Milk)

 

కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

కొబ్బరి పాలల్లో దూదిని.. దాంతో ముంచి ముఖభాగంగలో.. మెడభాగంలో రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

యాంటీ ఏజింగ్ ప్యాక్స్‌ను వారానికి రెండు నుంచి మూడు సార్లు వేసుకోవడం ద్వారా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.